Sunita Williams: క్షేమంగా భూమిపై అడుగు పెట్టిన సునీతా విలియమ్స్.! 13 d ago

సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్(Sunita Williams), ఆమె సహచరుడు బుచ్ విల్మోర్(Butch Wilmore) దాదాపు తొమ్మిది నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి సురక్షితంగా భూమికి చేరుకున్నారు. భారత కాలమానం ప్రకారం మార్చ్ 19 (బుధవారం) తెల్లవారుజామున 3:27 గంటలకు Space X క్రూ డ్రాగన్ 'ఫ్రీడమ్' క్యాప్సూల్ ఫ్లోరిడా(Florida) తీరంలోని సముద్ర జలాల్లో విజయవంతంగా ల్యాండ్ అయింది. సునీత, బుచ్‌లతో పాటు నాసా కమాండర్ నిక్ హేగ్( Nick Hague), రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్(Alexander Gorbunov) కూడా భూమికి చేరుకున్నారు.
నిజానికి వీరు కేవలం ఎనిమిది రోజుల యాత్ర కోసం గతేడాది జూన్ 5న ఐఎస్ఎస్( ISS) కి వెళ్లారు. కానీ, బోయింగ్ 'స్టార్ లైనర్' వ్యోమనౌక( Boeing Starliner spacecraft)లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా వారు 286 రోజుల పాటు అంతరిక్షంలోనే ఉండాల్సి వచ్చింది.
సునీత విలియమ్స్ ఆమె బృందం ఐఎస్ఎస్( ISS) నుంచి బయలుదేరే ముందు ఇతర వ్యోమగాముల(Astronauts)కు వీడ్కోలు పలికారు. అంతా కలిసి ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు. ఆ తర్వాత వారు భూమికి చేరుకునేందుకు క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌లోకి ప్రవేశించారు.
భారతీయ కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8:15 గంటలకు ఈ వ్యోమనౌక(spacecraft) తలుపులను మూసివేశారు. ఉదయం 10:15 గంటలకు అది ఐఎస్ఎస్ నుంచి విడిపోవడం ప్రారంభించింది. 10:35 గంటలకు పూర్తిగా బయటకొచ్చింది. భూమి వైపు ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈ వ్యోమనౌక వేగాన్ని నియంత్రించడానికి అనేకసార్లు రాకెట్ ఇంజిన్లను మండించారు. భూమిపై దిగాల్సిన ప్రదేశానికి చేరుకోవడానికి క్రూ డ్రాగన్ ముందు భాగంలో ఉన్న నాలుగు 'డ్రాకో' ఇంజిన్లను ఏడున్నర నిమిషాల పాటు వినియోగించారు.
భూ వాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు అధిక వేడిని తట్టుకోవడానికి వ్యోమనౌక కోన్ భాగాన్ని మూసివేశారు. వ్యోమగాముల(Astronauts)ను రక్షించడానికి.. అధిక వేడిని తట్టుకునే రక్షణ వ్యవస్థను ఆన్ చేశారు.
భూ వాతావరణంలోకి ప్రవేశించే సమయంలో 1650 డిగ్రీల సెల్సియస్ వేడిని తట్టుకుని పారాచూట్ల సహాయంతో వ్యోమగాములు సురక్షితంగా సముద్రంలో ల్యాండ్ అయ్యారు.
వ్యోమగాములు(Astronauts)భూమికి చేరుకునేందుకు దాదాపు 17 గంటల సమయం పట్టింది. వ్యోమనౌక(spacecraft) సముద్రంలో దిగగానే.. సహాయక సిబ్బంది వేగంగా స్పీడ్ బోట్లలో అక్కడికి చేరుకున్నారు. పరిస్థితులు అదుపులో ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత వ్యోమనౌకను 'మేగన్స(Megan) అనే నౌకపైకి చేర్చారు. ఆ తర్వాత.. స్పేస్‌ఎక్స్ సిబ్బంది వ్యోమనౌకలో ఉన్న నలుగురు వ్యోమగాములను ఒక్కొక్కరిని జాగ్రత్తగా బయటకు తీసుకువచ్చారు.
మొదట కమాండర్ నిక్ హేగ్( Nick Hague), ఆ తర్వాత అలెగ్జాండర్(Aleksandr Gorbunov) , సునీతా విలియమ్స్(Sunita Williams), చివరకు విల్మోర్(Butch Wilmore) బయటకు వచ్చారు. క్రూ డ్రాగన్ నుంచి బయటకు రాగానే.. సునీతా విలియమ్స్ ఆనందంతో చేతులు ఊపుతూ అందరికీ అభివాదం చేశారు.
సునీత.. ఆమె బృందం సురక్షితంగా భూమికి చేరుకోవడంతో గుజరాత్‌లోని ఆమె పూర్వీకుల గ్రామమైన ఝూలాసన్(Jhulasan)లో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ విజయం అంతరిక్ష పరిశోధనలో ఒక మైలురాయిగా నిలిచింది. సునీతా విలియమ్స్.. ఆమె సహచరులు తమ ధైర్యసాహసాలతో సాంకేతిక సమస్యలను అధిగమించి సురక్షితంగా భూమికి చేరుకోవడం ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిని నింపింది.